Geetha Koumudi-1    Chapters   

పదియవ కిరణము

కృష్ణునిబోధ- సాంఖ్యయోగ సారము

(గీత-2వ అధ్యాయము)

అర్జునుడు విషాదముతో మూఢుడైపోయి విల్లును బాణములను పారవేసి మూర్ఛవచ్చినట్లుగా పడిపోగా, అతనికి అట్టి స్థితిలో కృష్ణుడు బోధచేయుట సాధ్యము కాకపోయినది. అతను లేచి కూర్చుని మామూలుస్థితిలోనికి వచ్చుటకు గాను కృష్ణుడు గీత 2వ అధ్యాయములోని 2, 3 శ్లోకములతో ఒక ఘాటైన ఇన్‌ జక్షన్‌ ఇచ్చి నాడు 'అర్జునా ! నీవు పూర్వము బృహన్నల వేషం వేసినపుడు నపుంసకునివలె నటించినావు కాని నపుంసకుడివి కాలేదే ? ఇపుడు కేవలం నపుంసకుడివి అయిపోయినావేమి ? యుద్ధం ప్రారంభం కాబోయే ఇట్టి విషమపరిస్థితిలోనా నీకీ చచ్చుతనం ? ఇట్టి స్థితి పారమార్థికమునకు భంగము కనుక పారమార్థిక చింత గల ఆర్యులు మెచ్చరు; స్వధర్మమునకు విరుద్ధమై అస్వర్గ్యము కనుక ధర్మచింతగల ధార్మికులు మెచ్చరు; పోని, పారమార్థికమును కాని ధర్మచింతనుకాని ఎరుగని కేవల లౌకికులు మెచ్చుతారా అంటే, వారున్నూ మెచ్చరు; ఏల ననగా అట్టి లౌకికులకు దేవుడు స్వర్గము లేకపోయినా, ప్రతిష్ఠావాంఛ ఉంటుంది. ఇపుడు నీవు చేసేపని అప్రతిష్ఠకు కారణ మవుచున్నది. కనుక వారున్ను మెచ్చరు. ఈ 3రకముల మానవులు కాక వేరే మానవులేలేరు. కనుక అర్జునా, నీవు యిపుడు చేయుచున్నపని మానవమాత్రుడైనవాడు ఎవడు చేయని క్షుద్రమైనది. అట్టి హృదయదౌర్బల్యమును మాని మనుష్యునిలాగ ప్రవర్తించు; శత్రువులను తపింప జేసే వాడను అని 'పరంతప' అను గొప్ప బిరుదునుకూడా పెట్టుకున్నావే; అట్టి నీవేనా యిపుడు పిరికిపందవైనావు ! లే ! వీరుని వలె ప్రవర్తించు ! 'పరంతప' అను బిరుదును సార్థకము చేసికో అని బాగా రోషమువచ్చే బాణాలవంటి మాటలతో అర్జునుని కృష్ణుడు పొడిచేటప్పటికి, అర్జునుడు ఆ చచ్చుతనము వదలిలేచి కూర్చున్నాడు. ఇపుడు యితనిని బోధకుసుముఖుని చేసికొనుటకుగాను కృష్ణుడు ఒకచిన్న సున్నిత మైన ఇన్‌ జెక్షను యిచ్చినాడు. అది 2వ అధ్యాయం 10 శ్లోకములో 'ప్రహసన్నివ' అను మాటలలో గర్భితంగా ఉన్నది. అర్జునుడు ఏడ్చుట సరియైనపని కాదని అర్జునునికి తెలియపరచవలెను. కృష్ణుడు మెదలకుండా ఊరుకుంటే అర్డునుడు దుఃఖించుట సవ్యమైనదే అని కృష్ణుడు అంగీకరించి నట్లు అవుతుంది. అలా కాక కృష్ణుడు ఏడుస్తూయున్న అర్జునునిముందు పక పకా నవ్వితే, అర్జునునికి కోపమువచ్చి ఉన్న గోడు చెడుతుంది; బోధకు సుముఖత రానేరదు. అందుకని కృష్ణుడు చిరునవ్వు నవ్వుతున్నాడో అన్నట్లుగానటించాడు. దీనివల్ల అర్జునునికి నేను చేస్తూన్నపని సరియైనది కాదా ఏమి కృష్ణుడు చిరునవ్వు నవ్వుచున్నాడు. అయితే ఆయన చెప్పేది ఏదో విందాము అని సుముఖత కల్గుటకు అవకాశము కల్గి నది. బోధకు సుముఖుని చేసే మార్గము జగన్నాటక సూత్రధారియైన ఆ కృష్ణునికే తెలియవలె; యింకొకరికి సాధ్యమా !

ఈ విధముగా కృష్ణుడు తన బోధకు అర్జునుని సుముఖునిగా చేసుకొని 2వ అధ్యాయం 11 శ్లోకములో బోధను ప్రారంభించినాడు.

'అశోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చభాషసే|

గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః ||'

అను 11 వ శ్లోకములో కృష్ణునిబోధ అంతయు బీజప్రాయంగా ఇమిడియున్నది. ఈ శ్లోకములో 3 భావములున్నవి. అవే మనగా :-

1. అర్జునా, మూఢునివలె ఏడవకూడని వారికోసము నీవు ఏడుస్తున్నావు.

2. మాటలా, పండితునివలె మాట్లాడుచున్నావు.

3. అర్జునా, పండితులైనవారు చచ్చినవారికోసము గాని చావనివారికోసముగాని ఎవరికోసము ఏడవరు అని కృష్ణుడు అన్నాడు.

ఇక్కడ పండితుడు అనగా ఆత్మజ్ఞానము కలవాడని అర్థము. 'పండ' కలవాడు పండితుడు. 'పండ' అంటే ఆత్మజ్ఞానము. మాటలు కోటలు దాటుచున్నవి; కాని చేతలు గడపలు దాటుటలేదు, అను సామెతప్రకారం అర్జునుని మాటలలో పాండిత్యము కనబడుచున్నది. కాని అర్జునుని చేతలలో అనగా ఏడ్చుటలో మూఢత్వము తాండవించుచున్నది. ఇట్టి పరస్పర విరుద్ధమైన అర్జునుని ప్రవృత్తియే కృష్ణుని చిరునవ్వుకు కారణమైనది.

అర్జునుడు ఏడ్చుటలో మూఢత్వము కనబడుచున్న మాట నిజమే. కాని అర్జునుడు పండితునిలాగ ఎక్కడ మాట్లాడినాడు? అంటే 1వ అధ్యాయములోని 38 మొదలు 44 శ్లోకములలో అట్టి భావములను కనపర్చినాడు. యుద్ధం జరిగితే కులక్షయ మవుతుంది కనుక అట్టి పాపం వస్తుంది. వర్ణసాంకర్యము కలుగుతుంది కనుక అట్టి పాపం వస్తుంది. ఇట్టి పాపాలవల్ల నరకము వస్తుంది అని అర్జునుడు విలపించినాడు. నరకము వచ్చేది ఎవరికి? శరీరముతోపాటు, లోనిజీవుడు కూడా నశింంచేటట్లైతే నరకానికి పోయేది ఎవరు? నరకము వస్తుంది అని అనుటలో భావమేమి? చనిపోయేది శరీరమే అనిన్నీ శరీరములోని జీవుడు చనిపోక చెడ్డపనులు చేస్తే నరకానికి పోతాడు అని భావము స్పష్టమేకదా? యీ విధముగా జీవుడు చనిపోక నిత్యముగా ఉంటాడు. అను భావము దృఢముగా ఉంటే చనిపోతాడు అనిదుఃఖించుట తెలివితక్కువేకదా? వీరందరు చనిపోతారే అని అర్జునుడు దుఃఖించాడు, అని అంటే శరీరంతోపాటు జీవుడు కూడా చనిపోతాడు అనేకదా అర్జునుని భావము. ఇట్లు అర్జునుని ఏడ్పులో శరీరమే జీవుడు అను భావమున్ను, అర్జునునిమాటలలో శరీరం వేరు, జీవుడు వేరు. శరీరం నశించినా జీవుడు నశించడు అను అందుకు విరుద్ధభావమున్ను వ్యక్తమగుటచేత కృష్ణుడు చిరునవ్వును నటించి, పండితులైనవారు ఎవరికోసమున్ను, ఏపరిస్థితులలోను, ఎప్పుడు దుఃఖించరు అనుబోధను ప్రారంభించినాడు. పండితులు అయినవారు చచ్చినవారి కోసంగాని బ్రతికి ఉన్నవారికోసంగాని ఎప్పుడు ఏపరిస్థితులలోను దుఃఖించరు.అనుటలో చచ్చినవారికోసం ఏడ్చుట అనునది, అందరికి తెలిసినదేగాని, బ్రతికి ఉన్నవారికోసం ఏడ్చుట అనగా ఏమి ? ఆలాగైతే ఏడ్చేవారు ఎన్నిరకాలు అను ప్రశ్నలు పుట్టును. బాగా విమర్శించి చూస్తే మనుష్యులు నాల్గు రకాలుగా కనబడతారు!

1. చచ్చినవారికోసము మాత్రమే ఏడ్చేవారు. వీరు అజ్ఞానులు, ఏమి తెలియనివారు, ఏరకము విజ్ఞానము లేనివారు.

2. చచ్చినవారికోసం బ్రతికి ఉన్నవారికోసంకూడా ఏడ్చేవారు, వీరు కించిద్జులు, కొంత విజ్ఞానము కలవారు.

3. చచ్చినవారికోసము ఏడ్వక, బ్రతికి ఉన్నవారికోసం మాత్రమే ఏడ్చేవారు, వీరు ధర్మజ్ఞులు; ధర్మజ్ఞానము కలవారు.

4. చచ్చినవారికోసంగాని, బ్రతికిఉన్నవారి కోసం గాని ఏడ్వనివారు. వీరు ఆత్మజ్ఞులు; ఆత్మజ్ఞానం కలవారు.

1. మొదటిరకంవారు, ఏరకం విజ్ఞానం లేని అజ్ఞులు, అనగా కేవలం మూఢులు. వీరు చచ్చినవారికోసంమాత్రమే ఏడుస్తారు. శరీరంతో పాటు జీవుడు కూడా చచ్చిపోతాడు అనుభావము కలవారు. బ్రతికి ఉన్నవారికోసం ఏడ్వవలసి వస్తుంది అను విషయముకూడా తెలియనివారు.

2. రెండవరకంవారు కీంచిత్‌ జ్ఞులు. అనగా కొంత విజ్ఞానం కలవారు. వీరు చచ్చినవారికోసం ఏడ్వటమేకాక, మిగిలిన వారి గతి ఏమి? వీరికి పోషణ ఏలాగు? వీరు ఏలా జీవిస్తారు? అను అనేకరకములైన దుఃఖభావములు బ్రతికి ఉన్నవారిని గురించి కలుగుట అందరికి తెలిసిన విషయమే కదా! ఇదే బ్రతికి ఉన్నవారికోసం దుఃఖించుట అంటే, కనుక యీ 2 వ రకమువారు ఉభయులకోసం ఏడుస్తారు.

3. ఇకను మూడవరకమువారు ధర్మజ్ఞులు; అనగా ధర్మం తెలిసినవారు. వీరు చచ్చినవారికోసం ఏడ్వరు. ఏలనగా, చావు అంటే శరీరానికేగాని జీవునకు కాదు అనిన్నీ, జీవుడు తన జన్మాంతరీయ కర్మఫలమును అనుభవించుటకు అందుకు తగిన కుటుంబములో పుత్రుడుగా జన్మించి కర్మఫలానుభవము అయిపోగానే ఆ శరీరము వదలిపోతాడు అనిన్నీ, అనుజ్ఞానం కలవారు కనుక, వారు చచ్చినవారి కోసం ఏడ్వరు. చావు అంటే శరీరాన్ని మార్చుట; చిరిగిన చొక్కాను వదలి మంచి చొక్కాను ధరించినట్లు, శిధిలమైన యింటిని వదలి మంచి యింట్లోకి పోయినట్లు, యీ శరీరాన్ని వదలి యింకొక శరీరానికి జీవుడు వెళ్ళుతాడు. జీవుడు ఒక శరీరంలో ప్రవేశిస్తే పుట్టుట అనిన్ని, ఆ శరీరాన్ని విడిస్తే చావు అనిన్ని తెలిసికొనవలయును. కనుక యీ పుట్టుక చావులు ఆ శరీరానికేగాని జీవునికి లేవు. జీవుడు నిత్యుడే, జీవుడు తన ఆధ్యాత్మిక అనుభవమును సంపాదించుకొనుటకు గాను ఒక్కొక్క కుటుంబములో ఒక్కొక్క మజిలీగా ఉండి అచట అనుభవాలు అయిపోగానే ఆ మజిలీని విడిచిపోతాడు. యీ విధముగా ప్రతిజీవుడు మోక్షమనే పట్టణానికి జీవయాత్ర చేస్తూ ఉంటాడు. భాగవతం 6వ స్కంధంలో చిత్రకేతూపాఖ్యానం యీ విషయమును విశదీకరించుచున్నది. ఆ చత్రకేతుడు అనురాజు ఎంతమంది భార్యలను వివాహంచేసుకొన్నా సంతానం లేకపోతే, నారదమహర్షి ఉపదేశమువల్ల పెద్దభార్యతో పుత్రకామేష్టి చేయగా పెద్దభార్యకు ఒక చక్కని పుత్రుడు కలిగెను. అందరు ఆ రాజును ఆ పెద్దభార్యను పుత్రుడు కలిగినాడని ఎంతో గౌరవిస్తూ ఉంటే, మిగతా భార్యలు అసూయచేత ఆ పిల్లవానికి విషము పెట్టించి చంపించినారు. ఆ దుఃఖము భరించలేక, ఆ రాజున్ను భార్యయున్ను ఘోరంగా ఏడుస్తూ ఉంటే, నారదుడు రాగా, పిల్లవానిని బ్రతికించమని ప్రార్థించినారు. నారదుడు ఆ పిల్లవాని జీవుని ఆ మృతశరీరంలో ప్రవేశించమని ఆజ్ఞాపించగా, ఆ జీవుడు ఆ మృత శరీరంలో ప్రవేశించినాడు. అంతట పిల్లవాడు బ్రతికినాడు. ఆ తల్లిదండ్రులు బ్రహ్మానందపడుచుండగా ఆ పిల్లవాడు నారదునితో "స్వామీ నన్ను ఎందుకు మళ్ళీ ఈ శరీరములో ప్రవేశ##పెట్టినారు" అని అడిగినాడు. అంతట నారదుడు మీ తల్లితండ్రులు నిన్ను చూడవలెనని అనుకొనుచున్నారు. అని చెప్పగా. ఆ పిల్లవాడు ఏ తల్లితండ్రి నన్ను చూడవలెనని అనుకొనుచున్నారు ? నాకింతవర్కు ఎంతోమంది తల్లిదండ్రులు మజలీలుగా అయినారు; యింకను యిట్టి మజిలీలు ఎన్నో దాటాలి; యీ మజిలీలోనే యింకా కూర్చుంటే ఏలా? అని ఆ తల్లిదండ్రులు వినేటట్టుగా అనేటప్పట్కి ఆ తల్లిదండ్రులకు వైరాగ్యంకలిగింది. ఈ విధముగా చావు అంటే చొక్కాను మార్చినట్లు శరీరాన్ని మార్చుటయే అనిన్నీ, జీవునికి చావులేదు అనిన్నీ, జన్మాంతరీయ కర్మఫలాన్ని అనుభవించుటకు శరీరమెత్తి ఆ కర్మ ఫలానుభవము అయిపోగానే ఆ శరీరాన్ని విడుచును అనిన్నీ, యిట్టి ధర్మం తెలిసిన ధర్మజ్ఞులు చనిపోయినవారిని గురించి ఏడ్వరు; కాని తమ వంశములో పుట్టిన పిల్లలు వృద్ధిలోనికిరాక, విజ్ఞానవంతులుకాక, మూఢులు అయి అప్రతిష్ఠను కలుగచేస్తారేమో అని బ్రతికివున్నవారిని గురించి మాత్రం దుఃఖంచుతారు.

4. నాల్గవరకమువారు ఆత్మజ్ఞులు; అనగా ఆత్మజ్ఞానం కల్గిన జీవన్ముక్తులు. వారు చనిపోయిన వారికోసం కాని, బ్రతికి యున్న వారికోసం కాని ఏడ్వరు. వీరికి జగత్తు సత్యంకాదు; జగత్తు అంతయు నాటకం వంటిది. స్వప్నమువంటిది మిధ్య. కనుక యీ జగత్తులో జరుగు సుఖదుఃఖాలను వారి మనస్సులో ఎట్టి మార్పు కలుగదు. వారు నిత్యము 'ఆత్మ న్యే వాత్మ నాతుష్ఠః' అని ఆత్మానందంలోనే ఉంటారు.

ఈ విధముగా కృష్ణపరమాత్మ అర్జునునికి గీతా బోధను ప్రారంభించిన మొదటి శ్లోకములోనే ఆత్మజ్ఞానులు ఎవరికోసం ఎపుడు ఏడ్వరు, అని చెప్పుటలో ఆత్మతత్వ జ్ఞానము యొక్క ఫలము దుఃఖ నివృత్తి, ఆత్మానంద ప్రాప్తి, అని వ్యక్తంచేసినాడు. ఇదియేకదా మోక్షస్వరూపము. ఇట్టి మోక్షము ఆత్మజ్ఞానమువల్లనేకల్గును అని గీతాబోధ సారమును బీజరూపముగా 11వ శ్లోకములోనే కృష్ణపరమాత్మ స్పష్టంచేసాడు. దాని విపులీకరణ యీ సాంఖ్య యోగములోని మిగతా శ్లోకములున్ను, దానికి విపులీకరణ మిగతా అధ్యాయములున్ను అయి యున్నవి. సాంఖ్యం అనగా 'సమ్యక్‌ ఖ్యాయతే, అనేన ఆత్మతత్త్వం' అను వ్యుత్పత్తినిబట్టి ఆత్మతత్వబోధయే కనుక, 2వ అధ్యాయమైన సాంఖ్యయోగముయొక్క సారము యీ 11వ శ్లోకమే.

__

Geetha Koumudi-1    Chapters